Useful Links

Showing posts with label Hindu dharmam. Show all posts
Showing posts with label Hindu dharmam. Show all posts

March 10, 2012

ఏది సత్యం ? (బెల్లాల సత్యనారాయణ)

సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పడమటి దిక్కున ఉన్న మేఘాలను చూస్తే అవి ఎర్రగా కనబడుతాయి. కొద్ది క్షణాల్లో ఎరుపు వర్ణం అద్రుశ్యమై పసుపు వర్ణం కన్పిస్తుంది. పసుపు రంగు పోయాక ఆకుపచ రంగు కన్పిస్తుంది. కొన్ని నిమిషాల్లో నీలి వర్ణం ఏర్పడుతుంది. ఆ తర్వాత అనేక వర్ణాల మిశ్రమం గోచరిస్తుంది. వాస్తవానికి మేఘానికి రంగు లేదు. సూర్య కిరణాల తాలుకు స్వచ్చమైన ప్రకాశంలోనే సప్తవర్ణాలు ఉన్నాయి. ఇవి మేఘాల్లో ప్రవేశిస్తాయి. వాయువు శక్తి ద్వారా మేఘాల అణువులు పొరలుగా ఏర్పడుతాయి. ఈ పొరల ద్వారా ఈ వర్ణాలు ప్రవేశిస్తాయి. సూర్యకిరణాలు లేని కారణం చేత ఈ వర్ణాలను మనం రాత్రి చూడలేము. ఈ రంగులు గల పదార్థాలను పగలే చుడగలుగుతాము. తెలుపు వర్ణం సుర్యకిరనలలోని ఏడు వర్ణాల లోను  ప్రతిబింబించి కొన్ని వర్ణాలని తనలోకి పీల్చుకుంటుంది. మిగిలిపోయింది ఆ పదార్థం తాలుకు వర్ణం లాగా రూపొందుతుంది. ఆయా పదార్థాలు ఆ వర్ణం లో ఉన్నాయని మనం భావిస్తున్నాం. కానీ వాస్తవానికి ఏ పదార్థానికి రంగు లేదు. 'ఈ' ఆకుపచ్చగా ఉంది, ఈ పదార్థం ఎర్రగా ఉంది అనేవి వట్టి భ్రమ మాత్రమే అంటున్నారు వేదాంతులు. అజ్ఞానులు మాయచే భ్రమిస్తున్నారు. విషయ వాసనలనే సత్యంగా భావిస్తున్నారు. లౌకిక వస్తువులు అసత్యమనే భావన విస్మరిస్తున్నారు. రాత్రి చీకటి లో తాడు పాము లా కన్పించటం భ్రాంతి. ముత్యపు చిప్పలో పిండి ని, ఎడారి లో మరీచికలను చూడటం అసత్యమే. వస్త్రం దారాలతో తయారైంది. దారాన్ని వస్త్రం నుండి వేరు చేస్తే మిగిలేది దారమే. ఆది లో దారమే ఉంది, అంతంలోనూ దారమే ఉంది. మధ్యలోనే దారం వస్త్రం రూపంలో కన్పించింది. నిజానికి వస్త్రమనే రూపం మిథ్య. దారం సత్యం. అలాగే సమస్త పదార్థాలు మిథ్యే. కుండ కూడా అలాంటిదే. మూడు కాలాల్లోను మట్టి మాత్రమే ఉంటుంది. ఉదజని, ప్రాణ వాయువు కలిస్తే నీరు ఏర్పడింది. నీరు ఈ రెండింటి కన్నా భిన్నం కాదు. ఇక్కడ జలమూ భ్రాంతే. అగ్ని తాలుకు మరో రూపమే నీరు అని ఉపనిషద్ వచనం. విశ్వం లో మనకి కన్పించని సూర్యుళ్ళు నక్షత్రాలు ఉన్నాయంటున్నారు ఖగోళ శాస్త్రవేతలు. మనకు కన్పిస్తున్న నక్షత్రాలను సత్యంగా భావిస్తున్నాం. ఒక వస్తువు ఒక వ్యక్తికి సుఖాన్ని కలిగిస్తుంది, మరొకరికి దుఖకారకమవుతుంది. ఒకరికి ఇష్టమైనది మరొకరికి అయిష్టమవుతుంది. జంతువులు ఇష్టంగా తినేవాటిని మనిషి ఇష్టంగా తినడు కదా. వస్తువులు సుఖ దుఖలని ఇస్తాయన్నది మన భ్రమ మాత్రమే. సమస్త పదార్థాలు పంచ భూత సమ్మిశ్రమాలు. వాటి మూల తత్వాలు అను ధర్మాలకు భిన్నం కావు. వివిధ భూతాలు ఏర్పడటానికి అణువులు అనేక పొరలుగా ఏర్పడుతున్నాయి. నిజానికి మన మనసు సైతం అనేక అణువులతో నిండిన రాశే. కామం, క్రోధం, లోభం, గర్వం మొదలైనవి భౌతికంగా ఉనికిని కల్గి లేవు, అవి మనసులోనే ఉన్నాయి. మనసు ఆయా వృత్తుల్ని ధరించి మనిషిని సుఖ దుఃఖాలు అనుభవించేలా చేస్తుంది. బ్రహ్మమొక్కటే సత్యం, నిత్యం అన్నారు శంకరులు. సముద్రం లోని అలల్లా బ్రహ్మంలో మనో సంకల్పాలనే కెరటాలు లేస్తుంటాయి. మనసు జగత్తుకి జన్మ స్థానం. బ్రహ్మం మనసుకి మూలం. మనో సంచారం లో దుఃఖ పూరితమైన జగత్తు కన్పిస్తుంది. అది ప్రశాంతంగా స్థిరంగా ఉంటే సచ్చిదానంద పరబ్రహ్మానుభూతి కల్గుతుంది. మనసుని జయించడానికి భగవదనుగ్రహం కావాలి. సద్గురువు కూడా కావాలి. గురువు సత్యం కాకపోయినా జనన, మరణ సాగరాన్ని దాటడానికి నావలా సహకరిస్తాడు. జ్ఞానానికి ఈ జగత్తు కాలిపోయిన వస్త్రం లాంటిది. జీవుడు, జగత్తు, అల్పమైన 'నేను' అన్ని అసత్యాలే.