వసంతం రుతువుల రాణి. తొలి మాసమైన చిత్రం లో వసంతం వెల్లివిరుస్తుంది. వసంతం ప్రకృతి కాంతకు సీమంతోత్సవం.వసంతం మధు మాసం. మాధవ మాసం. వసంతం రాగానే ఫలపుష్పాలన్నీ ఒకదానికొకటి పోటిపడి పూస్తాయి. వసంతం హాయిగోలిపేది మలయమారుతం. వాయుదేవుడు మంచి గంధపు వృక్షాల పరిమళమే అన్ని చెట్లకూ కలిగించాలని ఆ సుగంధాన్ని మోసుకొని చెట్లకు పట్టించాడని అంటారు 'కృష్ణదేవరాయలు'. అందుకే వాయుడు గంధవహుడయ్యాడు. వసంతకాలంలో ఎర్రగా పూచేవి మోదుగు పూలు. ఆ ఎర్రని పూలతో రంగులు తయారు చేసి, వసంతోత్సవ కాలంలో స్త్రీ, పురుషులు చల్లుకునేవారు. వసంతం రాగానే దేవకాన్తలు హిందోళరాగంలో గానం చేసారంటారు 'పెద్దన'. ప్రణయ భావాలను వ్యక్తంచేసే హిందోళం రసజ్ఞుల హృదయాలకు పల్లకి వంటిది. వసంతంలో పూచే నందివర్ధనాలు కంటికి చల్లదనాన్ని ప్రసాదించేవైతే, మల్లెలు, జాజులు శిరోజాలంకరనకే కాదు- పరిమళ ద్రవ్యాల్లోనూ ఉపయోగపడుతున్నాయి. వేప, నేరేడులు మధుమేహగ్రస్తులకు ఔషధాలకు ఉపకరిస్తే, కానుగాకాయలు వృషణాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. మానవ జీవితమే ఆరు రుతువుల సమ్మేళనం. కొత్తగా చిగురించే ఆశలే వసంతం. భవిష్యత్తుపై ఆశలు పెంచి కొత్త జీవితానికి ఊపిరులూదేది వసంతం. ప్రకృతి అందాలలో పరవశించే మొదటి తొమ్మిది రాత్రులను "వసంత రాత్రులు'' అంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టి ప్రారంభించాడని పురానోక్తి. అదే యుగాది ఉగాది. ఉగాది ఆచారాల్లో అంతరార్థం ఉంది. ఆరోజు మనం స్వీకరించే పచ్చడి లో సుఖదుఖాతమక ద్వంద్వ ప్రకృతి ఇమిడి ఉంది. దుఖంలో కుంగి బ్రతుకు బారంగా గడిపే వారిలో సైతం నూతన విశ్వాసాన్ని ఆపాదింపచేసి జాతీయ పునరుజ్జీవనానికి నవనవోన్మేష సందేశాన్ని ఇస్తుంది ఉగాది. చైత్ర శుద్ధ తదియ నాడు డోలా గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. దీన్ని సౌభాగ్య గౌరీవ్రతమనీ వ్యవహరిస్తారు. ఆరోజే మత్స్యజయంతి.మహా విష్ణువు ధరించిన అవతారాల్లో మొదటి అవతారావిర్భావం. చైత్రశుద్ధ నవమి శ్రీరామ నవమి. శ్రీరాముని జననం కళ్యాణం ఆరోజునే. చైత్రశుద్ధ దశమిని ధర్మరాజు దశమి అంటారు. చైత్రశుద్ధ ఏకాదశి వరూధీన్యేకాదశి. దీన్ని ఆచరించిన వారికి, వేయి గోవుల దానఫలం లభిస్తుందని విశ్వాసం. చైత్రశుద్ధ త్రయోదశి అనంగ వ్రతం. రతీ సహిత మన్మధ పూజ నాటి విశేషం. ఆరోజునే జైన తీర్థంకరుడు వర్ధమానుడి జయంతి నిర్వహిస్తారు. చైత్రశుద్ధ పౌర్ణిమ హనుమజ్జయంతి. ఈవిధంగా ప్రకృతి సౌందర్యానికి, పర్వదినాల ఉత్సాహాలకు నెలవు వసంతం.
Source: Eenadu Antharyaami
No comments:
Post a Comment
Thank you,
- Hinduadhyathmikam.